ఆర్నబ్ తుఫాన్ సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాదకర ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
✍️ దివిటీ మీడియా – భద్రాచలం
‘అర్నాబ్’ తుపాను వల్ల భారీవర్షాలకు అవకాశమున్న నేపథ్యంలో ముప్పు వాటిల్లే ప్రాంతాలను గుర్తించి ఎన్టీఆర్ఎఫ్ బృందం, అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీచేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తెలిపారు. అధికారులంతా 24గంటలూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం తన ఛాంబర్లో సబ్ కలెక్టర్, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందంతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వరదలు, భారీవర్షాలు, ఇతర విపత్తుల పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపైన, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం, సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో భద్రాచలం డీఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీడీఆర్ఎఫ్) బృందం,అగ్నిమాపకశాఖ అధికారులు కలిసి భద్రాచలంలోని వరద ప్రమాదకర ప్రాంతాలు పరిశీలించారు. భారీవర్షాలు, వరదల సమయంలో ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష చేశారు. భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలోని అన్నిప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టాలని, గుర్తించిన ప్రతి చోటా తగిన భద్రతాచర్యలు తీసుకుని ప్రజల భద్రత పట్ల సునిశ్చితం చేయాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

