కని పారేసిన కర్కశ హృదయం…
పుట్టిన వెంటనే రోడ్డుపాలైన పసికందు
సర్పంచ్ చొరవతో శిశువుకు దక్కిన పునర్జన్మ
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
అప్పుడే పేగుతెంచుకు పుట్టిన శిశువును మృత్యువుకు వదిలేసిన కర్కశత్వమది.. కడుపులో మోసినభారం దిగిపోయిందనే
కఠిన హృదయమో? తప్పుచేసినందుకు తలదించుకోవాల్సి వస్తుందనే పాపమో? కడుపున పుట్టిన బిడ్డను పోషించలేననే వేదనో? మరేదైనా కారణమో తెలియదు గానీ కన్నపేగుకు కూడా కఠిన హృదయం ఉంటుందన్నది మరోసారి నిరూపితమైన క్షణమది… అప్పుడే పుట్టిన ఆ శిశువును నిర్దాక్షిణ్యంగా పారేసి వెళ్లిపోయారెవరో… ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని వీర్ బంజర గ్రామంలో అప్పుడే పుట్టిన మగశిశువును బొప్పాయి తోటలో వదిలివెళ్లిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సమాజానికే తలవంపులుగా నిలుస్తున్న ఈ ఘటనపై మానవతావాదులు ఆవేదన వ్యక్తంచేస్తూ ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం వీర్ బంజర గ్రామసమీపంలోని బొప్పాయి తోటలో ఒక శిశువు ఏడుపు వినిపించడంతో ఆ గ్రామస్తులు వెంటనే గ్రామ సర్పంచ్ భూక్యా రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం మంచుకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని ఆశా వర్కర్ రమాదేవికి సర్పంచ్ సమాచారం అందించారు. సర్పంచ్ సాయంతో ఆశా వర్కర్ ఆ శిశువును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువుకు వెంటనే వైద్యులు, వైద్యసేవలు అందించి ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ చెప్తున్నారు. నవజాత శిశువును ఎవరు వదిలివెళ్లారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం చిల్డ్రన్ ప్రొటెక్షన్(శిశు సంక్షేమ శాఖ) అధికారుల పర్యవేక్షణలో శిశువు భద్రంగా ఉన్నట్లు చెప్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ‘మానవత్వానికే మచ్చ’గా నిలిచింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

