రాజుపేటలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్


✍️ దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుపేటకాలనీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, నెంబర్ ప్లేట్లు లేని 8 వాహనాలును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 150 కేసులు నమోదు చేసి రూ.36,390 జరిమానాలు విధించారు. కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ అరుణ్ కుమార్ కాలనీవాసులతో మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి సేవించే వారిని గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కాలనీలలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనాలు వినియోగించేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలా ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వంటి వాటిని ఇతరులతో పంచుకోవద్దని డీఎస్పీ అరుణ్ కుమార్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించిన సమాచారం పోలీసులకు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు సహకరించాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజు, వెంకటప్పయ్య, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

