వెట్టిచాకిరీ, బానిసత్వ నిర్మూలన అందరి బాధ్యత
భద్రాద్రి కొత్తగూడెం అదనపుకలెక్టర్ వేణుగోపాల్
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
సమాజంలో కొనసాగుతున్న వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి అమానవీయమైన దురాచారాలు పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపుకలెక్టర్ డి.వేణుగోపాల్ కోరారు. కార్మిక హక్కులు పరిరక్షించడంతోపాటు, వారికి శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చూడాలన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలనపై తెలంగాణ కార్మికశాఖ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఐడీఓసీ కార్యాలయంలో అదనపుకలెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం ఆవిష్కరించారు. అసంఘటితరంగంలో కార్మికుల్లో వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మిక హక్కులు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వెట్టి చాకిరీ అనేది మానవహక్కులకు, వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే అమానవీయ విధానమన్నారు. ఎవరితో నైనా బలవంతంగా పని చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించకుండా పనిచేయించుకోవడం, కార్మికుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వారి శ్రమను దోపిడీచేయడం వంటి చర్యలు అరికట్టాలని ఆయన సూచించారు. ప్రతి కార్మికుడికి గౌరవ ప్రదమైన జీవితం గడిపే హక్కుందని, వారి హక్కులకు భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘స్వేచ్ఛా ధనం’ రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమంద్వారా వెట్టిచాకిరీ నిర్మూలన, బాధితుల గుర్తింపు, వారికి పునరావాసం కల్పించడం, హక్కులపై అవగాహన పెంపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడం ద్వారా వెట్టి చాకిరీ నిర్మూలనకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నట్లు వివరించారు. వెట్టిచాకిరీకి గురవుతున్న కార్మికులను గుర్తించడం, వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం, బాధితులకు పునరావాసం అందించడం వంటివి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలని తెలిపారు. కార్మికులకు తమ హక్కులు, వాటి పరిరక్షణకు అమలులో ఉన్న చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఎవరైనా బలవంతంగా పనులు చేయిస్తున్నా, వెట్టిచాకిరీకి గురి చేస్తున్నా, శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులు, సహాయం కోసం ‘080-69434343’ టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించి సమాచారం పొందవచ్చని తెలిపారు. కార్మికులు, బాధితులు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి చట్టపరమైన సాయం పొందేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇటుకబట్టీ, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు ఇతర పని ప్రదేశాల్లో అసంఘటిత రంగ కార్మికులకు ప్రచారరథంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలతో వెట్టిచాకిరీ వల్ల కలిగే అనర్థాలు, కార్మికులకు చట్టపరంగా కల్పించిన హక్కులు, రక్షణ చర్యలు, ఫిర్యాదు చేసే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. కార్మికుల శ్రమకు గౌరవం లభించేలా, వారు చేసిన పనికి తగిన ప్రతిఫలం అందేలా చూడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. వెట్టి చాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నిర్మూలనకు ప్రభుత్వశాఖలు, పరిశ్రమ యజమానులు, కార్మికులు, ప్రజలందరు సమన్వయంతో కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా సహాయ కమిషనర్ శ్యామల ప్రమోద్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె.శ్రీరామ్, సహాయ కార్మిక అధికారులు బి.నాగరాజు, పి.వి.కె.శాస్త్రి, ఎ.యేసుపాదం, చి.రజిత, ఏహెచ్‌టీఓ బృందం, ఏఐడీ ఎన్‌జీఓ ప్రతినిధులు, ఐజేఎం ప్రచార సాధకులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

