ఖమ్మంలో జనగణన-2027 ఫేజ్-2 శిక్షణకార్యక్రమం
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ఖమ్మంలోని జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్ (డీపీఆర్సీ) భవనంలో జిల్లా, డివిజన్, ఛార్జ్ స్థాయిల అధికారులకు రెండురోజులపాటు నిర్వహించిన ఫేజ్-2 శిక్షణకార్యక్రమం శుక్రవారం ముగిసింది. రాబోయే 2027 ఫిబ్రవరిలో జరగనున్న జనగణన క్షేత్రస్థాయి విధులు సమర్థంగా నిర్వహించేందుకు ఈ శిక్షణనిచ్చారు. ఈ శిక్షణ తరగతులకు హైదరాబాద్ సెన్సస్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి వచ్చిన సెన్సస్ అధికారులు హిమవర్ష, రాజు ముఖ్యశిక్షకులుగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని జిల్లా, డివిజన్, ఛార్జ్ స్థాయిల అధికారులకు జనగణన విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ దివాకర మాట్లాడుతూ, జనగణన-2027 ప్రక్రియ దేశ ప్రగతికి, అభివృద్ధిప్రణాళికల రూపకల్పన కోసం ఎంతో కీలకమన్నారు. 2027 ఫిబ్రవరిలో జరిగే జనగణన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయిలో సేకరించాల్సిన వివరాలు, ఫారాల నమోదు, మొబైల్ యాప్ / పోర్టల్ వినియోగం, చార్జ్ రిజిస్టర్ల నిర్వహణ, తదితర సాంకేతికఅంశాలపై శిక్షణనిచ్చారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పక్కాప్రణాళికతో, గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూనే పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక విభాగం అధికారులు, జిల్లా, డివిజన్, ఛార్జ్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

