సఫాయిబస్తీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్




49వాహనాలపై జరిమానాలు, 87 మద్యంసీసాలు స్వాధీనం
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫాయి బస్తీ ఏరియాలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో సబ్ డివిజన్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను గుర్తించి మొత్తం 49 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. ఆ ప్రాంతంలో నిల్వ ఉంచిన 87 ఐఎంఎఫ్ఎల్ మద్యంసీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ ఆదినారాయణ ప్రజలతో మాట్లాడారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి తాగే వ్యక్తుల గురించి గానీ మాదకద్రవ్యాల అక్రమరవాణా, విక్రయాల సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి డీ- అడిక్షన్ కేంద్రాలకు తరలించి, తదుపరి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ, వారెవరితో స్నేహం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాలపై తగినంత పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, శాంతిభద్రతల పరి రక్షణలో పోలీసులకు సహకరించాలని, ఆ ప్రాంతంలో మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సీఐలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌తో పాటు పోలీసు అధికారులు, దాదాపు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

