వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

ప్రచారరథం ప్రారంభించిన జిల్లాకలెక్టర్ దివాకర
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
సమాజంలో అనాదిగా కొనసాగుతున్న వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలనపై కార్మికశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఖమ్మం కలెక్టరేట్లో గురువారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికహక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రచారరథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాకలెక్టర్ దివాకర మాట్లాడుతూ, వెట్టిచాకిరీ అనేది మానవహక్కులకు, వ్యక్తిస్వేచ్ఛకు భంగం కలిగించే అమానవీయ విధానం అని, సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవ ప్రదంగా జీవించే హక్కుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా బలవంతంగా పనులు చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా పని చేయించుకోవడం వంటి అన్యాయాలకు పాల్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఆ బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కులు, అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇటుక బట్టీలు, ఆక్వా కల్చర్, గనులు, క్వారీలతోపాటు వెట్టి చాకిరీ చోటుచేసుకునే అవకాశం ఉన్న ఇతర పని ప్రదేశాల్లోని అసంఘటిత, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికరంగాలపై ఈ ప్రచారం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో వెట్టిచాకిరీకి తావులేకుండా, కార్మికులు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించేలా చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎం.కోటేశ్వరులు, జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ పి.కృష్ణవేణి, సహాయ కార్మిక అధికారి ఒ.రమేష్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రతినిధి భాస్కర్, జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు లక్ష్మయ్య, ఏఐడీ ఎన్జీఓ ప్రతినిధి శ్రీనివాస్, గజ్వేల్ కళాబృందానికి చెందిన వంశీ, రాధా, ప్రతాప్, వేణు, లత, సునీల్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

