పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం










నివాళులర్పించిన ఖమ్మం జిల్లాకలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
అమరవీరులైన పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘స్మృతి పరేడ్’ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారకస్థూపం వద్ద కలెక్టర్, సీపీ, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి, పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులను స్మరించుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లాకలెక్టర్ దివాకర మాట్లాడుతూ, విధినిర్వహణ విషయంలో పోలీసులకు అండగా నిలుస్తున్న కుటుంబసభ్యుల త్యాగాలు కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులను జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా నలుగురు పోలీసు సిబ్బంది తమ ఇంటిస్థలాలకు సంబంధించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, వారికి ప్రత్యామ్నాయస్థలాలు కేటాయించడంతో పాటు సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు, సీఐలు, ఆర్ఐలు, అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

