అప్పు తిరిగి చెల్లించమన్నందుకు హతమార్చాడు…
వ్యక్తి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
✍️ దివిటీ మీడియా – పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తానిచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగిన వ్యక్తిని ప్లాన్ చేసి హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్ది బుధవారం ఆ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి… కరకగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో కలవలనాగారం గ్రామానికి చెందిన బాధావత్ విజయ, తన కుమారుడు బాధావత్ రవిచంద్రను కరకగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ హత్యచేసినట్లు ఈ నెల(అక్టోబర్) 12న కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రవిచంద్ర, నిందితుడు ఇమ్రాన్‌కు రూ.80,000అప్పుగా ఇచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులు తిరిగి చెల్లించే విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడైన ఇమ్రాన్, పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీ రాత్రి దాదాపు 9.30 గంటల సమయంలో రవిచంద్రను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి కలవలనాగారం గ్రామ శివారులో అతనిపై దాడి చేసి, బెల్టుతో గొంతు బిగించి హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. బుధవారం ఆ నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్ అతని ఇంటి వద్ద ఉండగా అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్ కోసం న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉందని పోలీసులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

