గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సుజాతనగర్ మండల పరిధిలోని గరీబ్‌పేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలులేని 68 ద్విచక్రవాహనాలు, 19 త్రిచక్రవాహనాలు గుర్తించి, మొత్తం ఆ 87వాహనాలపై చట్ట ప్రకారం జరిమానాలు విధించారు. అంతే కాకుండా 30ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆ గ్రామస్థులతో మాట్లాడుతూ, గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, అమ్మకం వినియోగానికి సంబంధించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారినపడి, వాటికి బానిసలుగా మారక ముందే కాకుండా తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ వహించాలన్నారు. పేకాట, కోడిపందాలు, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తప్పవని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద ఆన్లైన్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇటీవల నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పునరావృతంగా నేరాలకు పాల్పడినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పకపాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకోసం పోలీసు శాఖకు సహకరించాలని, గ్రామంలో మత సామరస్యం కాపాడాలని సూచించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సీఐలు యాసీన్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, శ్రీలక్ష్మి, పోలీస్ అధికారులు, దాదాపు 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

