వెట్టిచాకిరీ ఆరోపణలపై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి
సుమోటోగా స్వీకరించి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
✍️ దివిటీ మీడియా – హైదరాబాద్
తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఓ నిర్మాణకేంద్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులతో దాదాపు ఏడాదిపాటు వెట్టి చాకిరీ చేయించినట్లు వచ్చిన ఆరోపణల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ (జిల్లా మేజిస్ట్రేట్), సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనలో రక్షించబడిన 12మంది బాధితుల ప్రస్తుత పరిస్థితి, ఆ దర్యాప్తు, విడుదల ధ్రువపత్రాలు, ఆర్థిక సాయం, దీర్ఘకాలిక పునరావాస ప్రణాళిక అంశాలపై వివరాలు కోరింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్ బాధితుల పక్షాన నిర్దిష్ట కాలపరిమితిలోగా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఈ సంఘటనలో రక్షించబడిన వెట్టిచాకిరీ కార్మికులు ప్రమాదకరం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో జీవించారని, వారికి సరైన వేతనాలు చెల్లించలేదని, వేధింపులకు గురిచేశారని, వారి కదలికలపై ఆంక్షలు విధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ బాధితులను రక్షించిన సమయంలో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ, వారానికి 7 రోజులపాటు పనిచేయిస్తున్నట్లు, వారిని భౌతికంగా, మాటలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు, ప్రమాదకర అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నివసిస్తున్నట్లు సమాచారం అందిందని కమిషన్ పేర్కొంది. ఆ వార్తా కథనంలో పేర్కొన్న అంశాలు నిజమైతే, కార్మికుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తీవ్ర పరిణామాల సమస్య అవుతుందని జాతీయ మానవహక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీచేసిన కమిషన్, ఘటన మీద నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అక్కడ
రక్షించబడిన 12మందిబాధితుల ప్రస్తుత పరిస్థితి, వారు ఎక్కడ ఉన్నారు?, వారి తక్షణ భద్రత, వసతి, ఆహారం, వైద్య సంరక్షణకోసం తీసుకున్న చర్యల వివరాలు నివేదికలో ఉండాలని కమిషన్ కోరింది. అదేవిధంగా యజమాని, ఇతర బాధ్యులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలు, దర్యాప్తు ప్రస్తుత స్థితి కూడా నివేదికలో పొందుపరచాలని పేర్కొంది.
విడుదల, పునరావాస ప్రక్రియ మొత్తం నిర్దిష్ట కాలపరిమితికి లోబడి, బాధితుల ప్రయోజనాలు కేంద్రంగా చేసుకుని జరిగే విధంగా చూడాలని మానవ హక్కుల కమిషన్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. అర్హులైన ఆ బాధితులందరికీ వెట్టిచాకిరీ నుంచి విడుదల ధ్రువపత్రాలు (Bonded Labour Release Certificates) జారీ చేశారో? లేదో? అనే విషయాన్ని కూడా నివేదికలో ధృవీకరించాలని కమిషన్ కోరింది. అలాగే 2021 నాటి వెట్టిచాకిరీ కార్మికుల పునరావాసం కోసం కేంద్ర రంగ పథకం కింద ప్రతి బాధితుడికి గరిష్టంగా చెల్లించాల్సిన రూ.30,000 తక్షణ ఆర్థిక సహాయం అందించారా? అనే వివరాలు సమర్పించాలని కమిషన్ సూచించింది.
అదనంగా, బాధితుల కోసం దీర్ఘకాలిక పునరావాసానికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించాలని కమిషన్ కోరింది. ఆ బాధితులు కోరుకుంటే, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని వారిని తిరిగి ఉత్తరప్రదేశ్‌కు పంపించేలా (repatriation) తీసుకునే చర్యలు కూడా ఆ ప్రణాళికలో చేర్చాలని పేర్కొంది. గత నెల 30న ప్రచురితమైన మీడియా కథనం ప్రకారం, వెట్టిచాకిరీకి గురైన ఆ కార్మికుల కదలికలపై ఆంక్షలు విధించడంతోపాటు, వారి వ్యక్తిగతమైన వస్తువులను ఒక సూపర్‌వైజర్ తాళం వేసి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు వారిని రక్షించినట్లు ఆ కథనం పేర్కొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

