ప్రజావాణిలో వచ్చిన విన్నపాలు త్వరగా పరిష్కరించండి
అధికారులను ఆదేశించిన భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
✍️ దివిటీ మీడియా – భద్రాచలం
తమ సమస్యల గురించి ప్రజావాణిలో దరఖాస్తుచేసుకున్న ప్రజలకు సంబంధిత అధికారులు వారి సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట డివిజన్ పరిధిలోని అధికారులను ఆదేశించారు. సమస్యల గురించి ప్రజలు నేరుగా ప్రజావాణిలో విన్నవించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం ఆ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల సమక్షంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆ దరఖాస్తులు పంపుతూ పరిష్కారాలకు ఆదేశించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందించే విధంగా చర్యలు, రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, నిరుద్యోగులకు వినతులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాల మంజూరు, నిరుద్యోగులు తమ సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, ఆన్లైన్ చేసి సంబంధిత కింది స్థాయి అధికారులకు పంపుతూ, ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలన్నారు. ఆ దరఖాస్తులు నిర్ణీతగడువులో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ సుధీర్, డీఏఓ భగవాన్ రెడ్డి, భద్రాచలం డివిజన్ పరిధి లోని వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

