గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
మాడవీధుల్లో రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తిచేయాలి
పరిశీలనలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
✍️ దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలంలో గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద మాడవీధుల్లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సకాలంలో పూర్తిచేయాలని, ఆ పనులు భక్తులకు సౌకర్యంగా ఉండేలా సంబంధిత అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఆదేశించారు. శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద మాడవీధులు, చప్టా దిగువ మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద జరుగుతున్న రోడ్డువిస్తరణకు పనులను ఆయన పంచాయతీరాజ్, ఆర్.అండ్.బి ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో శ్రీరామనవమి నాటికి ముందే భద్రాద్రి ఆలయంపనులు పూర్తిచేయాలని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయం మాడవీధులు, రోడ్డు విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రణాళిక ప్రకారం జరిగేలా చూడాలన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతోపాటు భద్రాచలం ఆలయాభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సమన్వయంతో, గత ఆలయ, జాతర ప్రాంతాల్లోని నిర్మాణ పనుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి దేవస్థానం ఈఓ దామోదర్ రావు,పీవీటీజీ అధికారి గన్యా నాయక్, తహసిల్దార్ రాంకుమార్, గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, మండల, పంచాయతీరాజ్, ఆర్.అండ్.బి, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

