గణేష్ నిమజ్జన ఊరేగింపులో తల్వార్‌తో విన్యాసాలు
ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన నలుగురు రిమాండ్
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మారణాయుధమైన తల్వార్‌ను గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విన్యాసాలతో ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించి, భయభ్రాంతులకు గురిచేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 23న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో గరీబ్‌పేట గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా, గరీబ్‌పేటకు చెందిన చిత్తరి లింగాప్రసాద్ చేతిలో తల్వార్ పట్టుకుని జనసమూహంలో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికలిగేలా ప్రవర్తించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో అతనితో పాటు పల్లె సతీష్, గోగుల నవీన్, నందతండాకు చెందిన భూక్య గణేష్ కూడా ఆ ఊరేగింపులో పాల్గొంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, పోలీసులను గమనించిన నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగల సందర్భంగా మారణాయుధాలను ప్రదర్శించడం, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, భయభ్రాంతులకు గురి చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

