రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

42 బ్లాక్ స్పాట్లలో భద్రతాచర్యలు వేగవంతం చేయాలి
సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో, ప్రమాదాలకు గల కారణాలను సమగ్రంగా విశ్లేషించి, ప్రమాదాల పునరావృతిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. భద్రత అందరి బాధ్యతగా అధికారులు, వాహనదారులు, ప్రజలు సమష్టి బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డుప్రమాదాలను తగ్గించగలమన్నారు.
ఐడీఓసీలో గురువారం జిల్లా రహదారి భద్రతాకమిటీ సమావేశంలో, నమోదైన రోడ్డుప్రమాదాలు, వాటికున్న కారణాలు, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టాల్సిన భద్రతాచర్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 42 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాల్లో గత ప్రమాదాలకు దారితీసిన కారణాలు విశ్లేషించి, అవసరమైన రహదారి భద్రత చర్యలు ప్రాధాన్యతక్రమంలో చేపట్టాలని సూచించారు. జిల్లాలో జనవరి నుంచి ఆగస్టు 31వరకు 349 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా ఆ ప్రమాదాల్ల 164మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 36 రోడ్డు ప్రమాదాలు జరగగా 14 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాల సంఖ్య, తీవ్రతను తగ్గించేలా ఆ ప్రమాదాలకు గల ప్రధానకారణాలను గుర్తించి, నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. రాత్రివేళల్లో రహదారులపై పశువుల సంచారం అధిక ప్రమాదాలకు కారణమవుతున్నందున పశువులను రహదారులపైకి వదిలే యజమానులపై నిబంధనలమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. అతివేగం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలు అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనకార్యక్రమాలతో పాటు కట్టుదిట్టంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. గుర్తించిన 42బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచికలు, రిఫ్లెక్టర్లు, రహదారి మార్కింగ్, తదితర భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపట్టాలని, అవసరమైనప్రాంతాల్లో అదనపు భద్రతా సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన పనుల పురోగతి సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని వేణుగోపాల్ ఆదేశించారు. రహదారులపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయడంతో పాటు, రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, పొదలు ఎప్పటికప్పుడు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని ఆయన సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు ప్రత్యేకంగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలనివారణకు భద్రత చర్యలను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య సేవలు అందేలా బ్లాక్ స్పాట్ల సమీపంలో ఉన్న ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని, అంబులెన్స్ సేవలు వేగంగా అందుబాటులోకొచ్చేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ ప్రమాదాల వివరాలు ఆన్‌లైన్ పోర్టల్లో వెనువెంటనే నమోదు చేసి నవీకరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, పంచాయతీ అధికారి అనూష, ఇంటర్మీడియట్ శాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్.అండ్.బి ఈఈ నాగేశ్వరరావు, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్, ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ బాలాజీ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

