Divitimedia
Bhadradri KothagudemFarmingHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

సీతాయిగూడెంలో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్

సీతాయిగూడెంలో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఆ గ్రామంలో సర్వే పురోగతి తెలుసుకున్న ఆయన, ఈ సర్వే వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో చేయాలని ఆదేశించారు. గ్రామంలో మొత్తం 1,823ఎకరాలకు రీ సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతోపాటు భూ వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టరుకు వివరించారు. గ్రామసభ నిర్వహించి, సమన్వయంతో రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. ఆ గ్రామంలో 200 వరకు నివాసాలున్నట్లు అధికారులు వివరించగా, భూమి కలిగి ఉండి పట్టాదారు పాస్‌బుక్స్ లేనివారు, పాస్‌బుక్స్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ భూమి వివరాలు సరిపోనివారు, భూమి వివరాలు రికార్డుల్లో నమోదు కాకుండా కూడా ఉన్నట్లు తెలిపారు. భూ రీ-సర్వే పూర్తయిన తర్వాత భూముల వాస్తవ పరిస్థితి గుర్తించి, రికార్డుల్లో అవసరమైన సవరణలు చేయడంతో పాటు అర్హులైన భూహక్కుదారులకు పాస్‌బుక్స్ పొందే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ గ్రామంలో గిరిజనులతో నేరుగా మాట్లాడి భూ రీ-సర్వే వల్ల వారికి కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారు. రీసర్వే తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కలెక్టరుకు తెలిపారు. గతంలో ఆర్థిక ఇబ్బందులతో భూముల రికార్డుల సవరణలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకోలేకపోయిన వారికి ప్రస్తుత రీసర్వే ప్రక్రియతో మేలు జరుగుతుందని చెప్పారు. పాత రికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో భూములను గుర్తించడం ద్వారా తమ భూ హక్కులకు మరింత స్పష్టత లభిస్తుందని గిరిజనులు పేర్కొన్నారు. గ్రామం పరిధిలో అటవీ భూములు కూడా గణనీయంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దగూడెం బ్లాక్ పరిధిలో దాదాపు 5,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉండగా, సీతాయిగూడెం గ్రామ పరిధిలో దాదాపు 700 నుంచి 800 ఎకరాల వరకు అటవీభూమి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం రామవరం, చండ్రుగొండ అటవీ రేంజిల పరిధిలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత భూరికార్డులు, మ్యాపులు పరిశీలించారు. దాదాపు 1920 నాటి పాత మ్యాపులు, రికార్డులు పరిశీలిస్తూ అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటలు తదితర వివరాలను నమోదు చేసిన విధానం తెలుసుకున్నారు. ఆ కాలంలో ఏర్పాటు చేసిన భూముల హద్దు రాళ్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదని అధికారులు వివరించగా, భూమి రీసర్వేలో హద్దులు స్పష్టంగా నిర్ధారించి, భవిష్యత్తులో కూడా సులభంగా గుర్తించే విధంగా శాశ్వత హద్దుగుర్తులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రీసర్వే ద్వారా భూమి వాస్తవవిస్తీర్ణం, హద్దులు, సర్వేనెంబర్లు, పట్టాదారు వివరాల వంటి అంశాలతో ఏ ఒక్క అర్హుడి భూవివరాలు రికార్డుల్లో తప్పిపోకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని, అందరు సమన్వయంతో పనిచేసి రీసర్వే ప్రక్రియ నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ జగదీశ్వరప్రసాద్, సర్వే, అటవీశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉన్నత లక్ష్యాల సాధనకు శ్రమించాలి

Divitimedia

ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలే లక్ష్యం

Divitimedia

నేడు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రోజ్ గార్ మేళా’

Divitimedia

Leave a Comment