జింకలగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్




✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ ఆర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు సబ్ ఇన్స్పెక్టర్లు మేడా ప్రసాద్, పి.నాగభిక్షం, రామ్మూర్తి, పాల్వంచ టౌన్ ఎస్సైలు నాగరాజు, విజయ, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్, డాగ్స్ స్క్వాడ్, సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించి ఇంటింటా సోదా చేశారు. జింకలగూడెం గ్రామంలో ఇళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారేమోనని, గ్రామంలో అసాంఘికకార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అంశాల గురించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ గ్రామస్థులతో మాట్లాడుతూ, ఆ గ్రామంలో గంజాయి సేవించే వారెవరైనా ఉన్నారా? గంజాయి, పశువులు అక్రమ రవాణా చేసిన వారుంటే వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఆ గ్రామంలో ఇటీవలి సంఘటనల వల్ల చేతబడి, బాణామతివంటివి నమ్మొద్దని, అలాంటి మూఢనమ్మకాలతో ఎవరినీ హింసించవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా వాహనదారులందరూ సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండి, వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

