Divitimedia
Bhadradri KothagudemFarmingLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

భూ రీసర్వే గడువులోగా పూర్తిచేయాలి

భూ రీసర్వే గడువులోగా పూర్తిచేయాలి

భూరీసర్వే, ఎస్ఐఆర్ లపై కలెక్టర్‌ సమీక్ష

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో తన క్యాంప్ కార్యాలయంనుంచి ఆయన మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మండలాలవారీగా పురోగతిని సమీక్షించారు. భూ రీసర్వేలో గ్రామసభను మొదటిదశగా నిర్వహించి రైతులకు సర్వే విధానం, తేదీలు, భూమి హద్దుల నిర్ధారణ, తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభలు పూర్తయిన వెంటనే గ్రామ సరిహద్దుల నిర్ణయం, హద్దుల గుర్తింపు, క్షేత్రస్థాయి సర్వే వంటి ప్రక్రియలు జాప్యం లేకుండా ప్రారంభించాలని ఆదేశించారు.
మండలాలవారీగా సమీక్షలో కొన్ని గ్రామాల్లో గ్రామసరిహద్దుల నిర్ణయం, హద్దుల స్థిరీకరణ, సర్వే పనులు కొనసాగుతున్నట్లు, మరికొన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తయి తదుపరి ప్రక్రియ కోసం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్‌ ఉన్న గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి సర్వే ప్రారంభించాలని కలెక్టర్‌ సూచించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, జీపీఓల, వీఆర్‌ఓ లను సమర్థవంతంగా వినియోగించి రోజువారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాత భూముల రికార్డులు, మ్యాపులను పరిశీలించి, భూ హద్దులు, సర్వే పాయింట్లు, కోఆర్డినేట్ల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సక్రమంగా వినియోగించాలని తెలిపారు. సర్వే పూర్తయిన రైతులకు ఖచ్చితమైన సరి హద్దులు, కోఆర్డినేట్లతో కూడిన భూమి మ్యాప్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. మండలాల వారీగా ఉన్న భూముల వివరాలు, భూముల హద్దుల నిర్ధారణ, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను సమీక్షించారు. భూముల యజమానులతో సమన్వయంతో ఆయా భూములరికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, హద్దులు స్పష్టంగా నిర్ధారించి నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు గానీ అభ్యంతరాలు గానీ ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసుల జారీ, హియరింగ్స్‌ , సంబంధిత పత్రాల ఆన్‌లైన్‌ అప్ లోడ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. మండలాలవారీగా హియరింగ్స్‌ పురోగతిని పరిశీలించి, కొన్ని మండలాల్లో హియరింగ్స్‌ సంఖ్య సిస్టమ్‌లో నమోదు కాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రుగొండ మండలంలో 24నోటీసులపై హియరింగ్స్‌ నిర్వహించినప్పటికీ, ఆయా పత్రాలు అప్‌లోడ్‌ చేయకపోవడంతో సిస్టమ్‌ లో పురోగతి నమోదు కాలేదని అధికారులు వివరించారు. హియరింగ్‌ నిర్వహించడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జిల్లా పురోగతి రాష్ట్రస్థాయిలో 62శాతం కాగా, భద్రాచలం 57.51శాతం, పినపాకలో 51 శాతం పురోగతి నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది. గుండాల, ఆళ్లపల్లి, పాల్వంచ, దమ్మపేట, అశ్వాపురం, కరకగూడెం, చంద్రుగొండ, పినపాక మండలాల్లోని నోటీసుల జారీ, హియరింగ్స్‌ పురోగతిని పరిశీలించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన కేసుల్లో హియరింగ్స్‌ నిర్వహించి, సంబంధిత పత్రాలు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో ప్రక్రియను 100శాతం పూర్తి చేయాలని, ప్రతి దశను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘వైఎస్సార్ జలకళ’ బోరు పనులు పునఃప్రారంభించాలి

Divitimedia

బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం

Divitimedia

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలు

Divitimedia

Leave a Comment