దివ్యాంగులకు న్యాయ అవగాహన సదస్సు
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ దివ్యాంగ బాలుర వసతిగృహంలో మంగళవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.దేవిమానస పాల్గొని, దివ్యాంగులకు ఉన్న చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలను వివరించారు. దివ్యాంగుల స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దివ్యాంగజన్ కౌశల్ వికాస్’ పథకంలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘దివ్యాంగజన్ రోజ్‌గార్ సేతు’ ద్వారా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దేవిమానస సూచించారు. ‘దివ్యాంగుల హక్కుల చట్టం, 2016’లో దివ్యాంగులకు కల్పించిన హక్కులు, రక్షణలు, సమాన అవకాశాల గురించి వివరించారు. దివ్యాంగుల విద్య,ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పలు సంక్షేమపథకాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులు తమ హక్కులను తెలుసుకుని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలని ఆమె సూచించారు. ఏవైనా న్యాయపరమైన సమస్యలెదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, ఈ సంస్థ ద్వారా అర్హులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయసలహా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎ.ప్రమీల, డీఎల్ఎస్ఏ నుంచి ప్యానెల్ న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

