జడ్పీ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాకలెక్టర్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ విద్యాబోధన, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, తరగతి గదుల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. పండుగ సెలవులు ముగిసినందున విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుని, విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో పుస్తకాల్లోని పాఠ్యాంశాలను చదివించి కొందరు విద్యార్థులు ఆంగ్లపాఠ్యాంశాలు చదవడం, వాటి అర్థాన్ని వివరించడంలో ఇబ్బందులెదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఆంగ్ల భాషానైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆంగ్ల ఉపాధ్యాయుడిని ఆదేశించారు. వివిధ పాఠ్యాంశాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేలా బోధన సాగాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తికి పలు సూచనలిచ్చారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధతో బోధించాలని, అవసరమైతే ప్రత్యేక తరగతులు నిర్వహించి, చదవి అర్థం చేసుకోవడం ద్వారా విషయాలను విశ్లేషించి వివరించడం వంటి నైపుణ్యం పెంపొందించాలని సూచించారు. ఇంకా ఆసక్తితో చదువుకునేలా ప్రోత్సహిస్తూ, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని స్పష్టంచేశారు. పాఠశాల్లోని భవన సముదాయం, సైన్స్ ల్యాబ్ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, సైన్స్ ల్యాబ్‌కు ప్రవేశ మార్గం, మెట్ల నిర్మాణాల ప్రతిపాదనలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకవసరమైన మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణప్రసాద్, సంబంధిత శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

