Divitimedia
Bhadradri KothagudemFarmingJudicialLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomenYouth

చుంచుపల్లి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

చుంచుపల్లి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన భూ రీసర్వే ప్రక్రియ పరిశీలించడంతో పాటు చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, సర్వే పురోగతి, సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన వివరాలు తెలుసుకున్నారు. చుంచుపల్లి గ్రామ పరిధిలో మొత్తం 2027.3ఎకరాల భూమి ఉండగా, ప్రభుత్వ భూములతో పాటు వ్యవసాయ భూముల రీసర్వేను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దులు కచ్చితంగా నిర్ధారించడంతోపాటు, రికార్డులు కూడా సమగ్రంగా పరిశీలించి వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సర్వే నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యా బోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులు పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, విద్యా ప్రగతిని, పాఠ్యాంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించి, పాఠశాలకు క్రమంతప్పక హాజరయ్యేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. మేధో వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించి, విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలకు రావడంలో ఇబ్బందులెదుర్కొనే విద్యార్థులకు ఇంటి వద్దే విద్యాబోధన అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి విద్యకు దూరంకాకుండా, వారి అవసరాలకనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, తాగునీరు, పారిశుధ్యం, వంటి సదుపాయాల వివరాలు తెలుసుకున్న కలెక్టర్, పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం కొనసాగిస్తూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా నాణ్యమైన విద్య బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిశీలనలో తహసీల్దార్ నాగరాజు, సర్వే అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దామరతోగులో ఎన్ కౌంటర్, మావోయిస్టు మృతి

Divitimedia

కొత్తగూడెంలో పోలీసుశాఖ మెగా రక్తదాన శిబిరం

Divitimedia

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment