ఉద్యమంలో జిల్లావాసుల విరామంలేని కృషి
ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర నేత గోపగాని
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమకారుల కృషి విరామంలేనిదని, రాష్టం సిద్ధించినా ఈ జిల్లా భారీగా నష్టపోయిందని రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ముఖ్య సలహాదారు గోపగాని శంకరరావు అన్నారు. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురంలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలవేదిక సాంస్కృతికవిభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లమోతు సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా గోపగాని శంకరరావు పాల్గొని మాట్లాడారు. రెండుమండలాలు ములుగు జిల్లాలో, ఐదు మండలాలు ఆంధ్రాలో కలిపి జిల్లాను కోలుకోకుండా చేసిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్దయతో వ్యవహరించారన్నారు. పోలవరం రివర్స్ వాటర్ వల్ల చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం తదితర మండలాల ప్రజానీకం ముంపు బారినపడి జనజీవనం స్తంబించటంతో, పంటలు పూర్తిగా చేతికందక ప్రజలు ఇబ్బందులకు గువుతున్నారన్నారు. ముంపు బారినపడ్డ గ్రామాల ప్రజలు గత ప్రభుత్వంలో పలుమార్లు పాలకులకు విన్నవించుకోగా మెరక ప్రాంతంలో ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీటిమూటలుగా మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నివారించడంలో విఫలమైనదన్నారు. సత్వరం ఆంద్రా ముఖ్యమంత్రితో మాట్లాడి పోలవరం ఎత్తు తగ్గించాలని, ఈ ప్రాంతంలో ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు రెండు రాష్ట్రప్రభుత్వాలు చర్చించుకుని పక్కా ఇళ్లు నిర్మించాలని, 2014 జూన్ 2 వరకు ఈ ప్రాంతంలో వుండి పాలకుల చీకటి ఒప్పందాలతో ఆంధ్రాప్రాంతంలో కలపబడిన ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకాలంలో అనేక కేసులెదుర్కొని తమ విలువైన కాలాన్ని కోల్పోయిన తెలంగాణ యువతకు ఉద్యోగకల్పనలో వయసు సడలించాలని, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుల గుర్తింపు కమిటి సభ్యుడు ప్రొపెసర్ కోదండరాం ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రంలో వివరించారన్నారు. కేకే కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, విద్యావేత్త మహమ్మద్ నహీంసాబ్ అకాల మరణం పొందటం ఉద్యమకారులకు తీరనినష్టమన్నారు. ఈ సమావేశంలో నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1.8శాతం ఓట్లతో అధికారం చేపట్టిందనే విషయం మర్చిపోకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బట్టు రాజేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి పోడియం నరేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకన్వీనర్ మూల నాగిరెడ్డి, పినపాక నియోజకవర్గ కన్వీనర్ కొక్కొండ ప్రసాద్, నాయకులు తోడేటి సత్యనారాయణ, బాగి వెంకట్రావు, రవికుమార్, దామోదర్ రెడ్డి, ఉద్యమకారులు దాసరి సాంబయ్య, కరీం, ఆలీ, హుస్సేన్, అనిల్, పుల్లయ్య, రామాంజిరెడ్డి, నర్సింహారావు, రఘు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

