రౌడీషీటర్లకు డీఎస్పీ వెంకన్నబాబు కౌన్సెలింగ్
నేరాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
✍️ దివిటీ మీడియా – ఇల్లందు
రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడకుండా, మంచి ప్రవర్తనతో మెలగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నేరాలకు పాల్పడినా చట్టప్రకారమే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన ఇల్లందు పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, రౌడీషీటర్ల కదలికలపైన ప్రవర్తనపైన పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలు, దాడులు, తదితర నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. గతంలో తమ నేరచరిత్ర పక్కనపెట్టి రౌడీషీటర్లు కుటుంబసభ్యులతో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ వెంకన్నబాబు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, ఉమా, సారంగపాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

