బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై వ్యాఖ్యల కేసులో పరిణామం
✍️ దివిటీ మీడియా – హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధును హైదరాబాద్ లో మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో తాతా మధును అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా కోకాపేటలో అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మధు కులం పేరుతోపాటు అసభ్యంగా కూడా దూషించారంటూ స్పీకర్ ఓఎస్డీ వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదుచేసి తాతా మధును అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధకచట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజైన సోమవారం చోటుచేసుకున్న రాజకీయ, గందరగోళ పరిణామాల్లో ఎమ్మెల్సీ మధు
స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశానికి నిరసనగా అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ మధును బర్తరఫ్ చేయాలంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాతా మధు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల అంశంపై తీవ్ర చర్చ జరగనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ వివాదంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన అంశాలపై శాసనసభలో జరగాల్సిన చర్చలు ఇలా పక్కదారి పట్టి ప్రజాప్రతినిధుల విలువ తగ్గించే పరిస్థితి రావడం పట్ల సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

