Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomenYouth

వరుస చైన్ స్నాచింగ్ కేసులు ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు

వరుస చైన్ స్నాచింగ్ కేసులు ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు

అంతర్రాష్ట్ర నేరస్తుడు సహా 8 మంది నిందితుల అరెస్ట్

రూ.26లక్షల విలువైన సొత్తు స్వాధీనం

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్(మెడలోని గొలుసు లాక్కెళ్తున్న) కేసులను జిల్లా పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. జిల్లాఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన వరుసచోరీల కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంబంధిత నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులు, అరెస్టయిన నిందితులకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.
ఈకేసుల్లో మొత్తం 8మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీ లో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి దాదాపు 150గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులను, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ దాదాపు రూ.26 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న సున్నం నాగేంద్రబాబు అలియాస్ నాగేంద్ర తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని తమ దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. మహిళల మెడలోని బంగారుగొలుసులు ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో కట్ చేసి క్షణాల్లో అపహరించి, తమ ద్విచక్రవాహనాలపై అక్కడి నుంచి పరారయ్యేవారు. కొన్ని సందర్భాల్లో వారు ముందుగానే ద్విచక్ర వాహనాలు చోరీచేసి, వాటిని ఆ తర్వాత నేరాలకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఆభరణాలను నిందితులు తమ వద్ద ఉంచుకోకుండా, ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ వెల్లడించాఫు. నిందితుల నుంచి తమ విచారణలో దమ్మపేట, పాల్వంచ రూరల్, బూర్గంపాడు, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన 10 కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ముఠాలో ప్రధాననిందితుడిగా అశ్వారావుపేట మండలంలోని, ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన సున్నం నాగేంద్రబాబు అలియాస్ నాగేంద్ర అని పోలీసులు గుర్తించారు. ఇతనిపై అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, బూర్గంపాడు, పాల్వంచ, భద్రాచలం, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 83 దొంగతనం కేసులున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇతనితో పాటు వల్లూరి శాంతరాజు అలియాస్ రాజు, ఊకే భద్రం అలియాస్ వీరభద్రం, బెత్తి కార్తిక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మ అలియాస్ సర్లమ్మ ఆనేవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో వల్లూరి శాంతరాజుపై 11 దొంగతనాల కేసులు, ఊర లింగయ్యపై 12దొంగతనం కేసులున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాధాల గ్రామానికి చెందిన మరో నిందితుడు తమ్మిశెట్టి బాలవీర స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అతడిని అంతర్రాష్ట్ర నేరస్తుడిగా గుర్తించామని, అతనికోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.
దమ్మపేట పరిధిలోని పార్కలగండి వద్ద ఓ వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు నానుతాడు చోరీ చేసినట్లు, బూర్గంపాడు పరిధిలో ద్విచక్ర వాహనం చోరీ చేసినట్లు, పాల్వంచ రూరల్ స్టేషన్ పరిధిలో మరో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. చోరీచేసిన ఆ వాహనాలను ఉపయోగించి బూర్గంపాడు, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులు చోరీ చేసి నట్లు దర్యాప్తులో వెల్లడైందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాయిగూడెం కేసులో ప్రధాననిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైన్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర కేసుల్లో చోరీచేసిన బంగారు ఆభరణాలు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు గుర్తించామని, నిందితుల సహకారంతో వాటిని తాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు. వరుస చైన్ స్నాచింగ్ కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా చోరీసొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులు ఛేదించడంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్సైలు రాజేశ్ కుమార్, యయాతి రాజు, బాలస్వామినాధం, దేవ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుళ్లు వెంకట్, ధర్మారావు,లక్ష్మయ్య, బాలకృష్ణ, రామకృష్ణారెడ్డి, నరసింహారావు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

Divitimedia

గిరిజన మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపులు

Divitimedia

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

Divitimedia

Leave a Comment