Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTelangana

భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్

భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్

మెడికల్ కాలనీలో పొంచి ఉన్న ప్రమాదం

హెడ్ కానిస్టేబుల్ మృతితోనూ మారని పంచాయతీ తీరు

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

విధి నిర్వహణ కోసం కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చి డ్రైనేజీలో పడి ప్రాణాలను కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ఉదంతం కూడా భద్రాద్రి గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని పోగొట్టలేకపోతోంది. వర్షపునీటితో నిండిపోయినప్పుడు డ్రైనేజీ కనిపించకపోవడంతో ఆ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. నీటితో నిండిపోయి ప్రమాదకరంగా మారిన ప్రాంతాల్లో రక్షణకు చర్యలు తీసుకోవాలనే ప్రాథమిక బాధ్యత కూడా విస్మరించారని అర్థమవుతోంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాతైనా వెంటనే స్పందించి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించి, కనీసం ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడం వంటి తాత్కాలిక చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే ప్రమాదకరమైన పరిస్థితులు భద్రాచలంలో పలు కాలనీలలో ప్రజలను మింగేసేలా ఉన్న దుస్థితి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. స్థానిక మెడికల్ కాలనీలోని, లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్, స్కూల్ ఎదురుగా సీసీ రోడ్డులో దాదాపు రోడ్డు మధ్యలో అత్యంత ప్రమాద కరంగా ఉన్న కల్వర్టుకి ఉన్న మ్యాన్ హోల్ అనేక నెలలనుంచి ప్రమాదకరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రతిరోజూ 24 గంటలూ విద్యార్దులు, స్థానికులే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు కూడా అనేకమంది ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటారు. ఏమాత్రం ఆదమరిచినా పెద్ద పరిమాణంలో ఉన్న ఆ గోతిలోపడి ప్రాణం కోల్పోవడం ఖాయంగా ఉంది. వాహనాలపై ప్రయాణిస్తున్నవారు కాస్త అటూ ఇటూగా వెళ్లినా కాళ్లు చేతులు విరగడమో, ప్రాణాలే పోవడమో ఖాయంగా కనిపిస్తోంది. ఇంతటి ప్రమాదకరమైన దుస్థితి ఉంటే ఇంతకాలం నుంచి ఏమాత్రం పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ దుస్థితిని మార్చేందుకు భద్రాచలం గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.


ప్రజల ప్రాణాలకే ప్రమాదం: ముర్ల రమేష్ (ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు)

———————-
మెడికల్ కాలనీలోని ఈ రోడ్డులో ప్రతిరోజూ వాహనదారులే కాకుండా అనేకమంది విద్యార్థులు, చిన్నారులు, వృద్ధులు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ కల్వర్టుకి అనుసంధానంగా పెద్ద డ్రైన్ నుంచి మురుగునీరు ప్రవహిస్తుంటుంది. వర్షం పడినప్పుడు రోడ్డు మీద నుంచి మూడు అడుగులమేర నీరు ప్రవహిస్తుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సారపాకలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Divitimedia

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2కె రన్

Divitimedia

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి : ఎస్పీ డా.వినీత్

Divitimedia

Leave a Comment