బాల్యవివాహాలు చేస్తే కఠినచర్యలు తప్పవు : ఎస్పీ
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
బాల్యవివాహాలు నిర్వహించినవారు, సహకరించినవారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ‘బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవం’ గా నవంబర్ 27వ తేదీని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ సభ్యులు బుధవారం ఎస్పీ రోహిత్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్యవివాహాలు చేసినవారు, వారికి సహకరించినవారిపై కూడా బాల్య వివాహ నిరోధకచట్టం, పోక్సోచట్టం కింద చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం తెలిసిన వారు వెంటనే 1098గానీ, డయల్ 100 గానీ జస్ట్ రైట్స్ సంస్థకు గానీ సమాచారం తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీని కలిసినవారిలో ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్, సభ్యులు మోహన్, మాన్ సింగ్, రవిచంద్ర, నాగేంద్రబాబు, మౌనిక ఉన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

