Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadNational NewsSpecial ArticlesTelangana

ఇసుకలో కాసుల వేట…

ఇసుకలో కాసుల వేట…

అధికారులు, అక్రమార్కుల దోబూచులాట…

సీఎం ఆదేశాలకూ ఇక్కడ లెక్కేలేదు…

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 1)

ఇసుక అక్రమరవాణాతో కాసుల వేటలో గోదారితీరంలో అధికారులు, అక్రమార్కుల దోబూచులాట కొనసాగుతూనే ఉంది… బహిరంగంగానే సాగుతున్న తమ అక్రమ దందాను ఆపే దమ్ము ప్రభుత్వానికే లేదంటూ ‘ఇసుక మాఫియా’ సవాల్ విసురుతోంది. బహుశా అదే నిజమేమోనని సగటు మనిషి నమ్మేలా అధికార యంత్రాంగం కూడా నీళ్లు నములుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకే ఇక్కడ దిక్కూమొక్కూ లేని దుస్థితి దాపురించిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి, కిన్నెరసాని నదుల తీరప్రాంతాలున్న బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఆరేడు నెలలుగా దర్జాగా సాగిన ఇసుక అక్రమ రవాణాకు అధికారుల అండదండలు పుష్కలంగా లభించగా, కోట్ల రూపాయల విలువైన లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తరలించారు. అసలు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం తమ ‘డ్యూటీ’ యే కాదన్న రీతిలో తమ వంతు అక్రమ రవాణాదారులకు సహకారమందించిన అధికారులు, తీవ్ర విమర్శలనూ లెక్క చేయకపోవడం గమనార్హం. పరిస్థితులు చేయిదాటిపోతున్న దశలో ఇటీవల సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్రమ ఇసుక రవాణా కట్టడికి ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం (మార్చి 1) కూడా మరోసారి సీఎం ఇసుక అక్రమ రవాణాకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బూర్గంపాడు మండలంలో మాత్రం ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడంలో అధికారులు దోబూచులాట కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో అక్రమార్కులు దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తుంటే తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భంలో అప్పుడప్పుడూ మాత్రం అధికారులు సిబ్బందిని రాత్రివేళ కాపలా పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్రమార్కులు సిబ్బందిపై దాడులు చేసినప్పటికీ ఆ తర్వాతనైనా అధికారులు కఠినచర్యలు తీసుకోకుండా నిర్లిప్తతతో వ్యవహరించి విమర్శల పాలయ్యారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లుగా ర్యాంపుల వద్ద ‘ట్రెంచింగ్’ చేయడం, ఆ వెంటనే దర్జాగా వాటిని పూడ్చివేసి అక్రమ రవాణాదారులు దందా కొనసాగించడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం కేవలం కార్యాలయాల నుంచి ప్రకటనలే తప్ప కఠినచర్యలు తీసుకున్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి మరోసారి ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ఆదేశించిన నేపథ్యంలో చర్యలు చేపట్టిన అధికారులు, వాటిని ఎంత పకడ్భందీగా కొనసాగిస్తారో చూడాలి మరి…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు

Divitimedia

ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, డీసీసీలతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశం

Divitimedia

Leave a Comment