పోలీసు సోషల్ మీడియా హ్యాండ్లర్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోషల్ మీడియా వేదికల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులతో మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్షించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితంచేసే హ్యాండ్లర్లు, వారి పోస్టులు, వీడియోలు, సందేశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. సోషల్ మీడియాలో రాజకీయ, మతపరమైన, కమ్యూనల్ అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు, సందేశాలు ప్రచారం చేసేవారిపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న పోస్టులను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అలాంటి పోస్టులు చేసే వ్యక్తులతోపాటు వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే హ్యాండ్లర్లపై నిరంతర నిఘా కొనసాగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులను షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, ఎస్సై చంద్రశేఖర్, పోలీసుశాఖ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

