Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ అంకిత్

✍️ దివిటీ మీడియా

గోదావరినదికి వరదలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, తదితర అధికారులతో కలిసి గోదావరి వరదల సన్నద్ధతపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలతో ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోట్లు, నాటుపడవలు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, టార్చ్‌లైట్లు, హ్యాండ్ మైకులు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముంపు పరిస్థితులు ఏర్పడక ముందే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. గోదావరి నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వరద పరిస్థితులపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ముంపు గ్రామాల ప్రజల ఫోన్ నెంబర్లు సేకరించి సమాచార వ్యవస్థ బలోపేతం చేయాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసరవస్తువుల సరఫరా తదితరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల, జిల్లా స్థాయిలలో కూడా కంట్రోల్ రూములు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. 108 అంబులెన్సులు, అత్యవసర మందులు, పాముకాటు, తేలుకాటు నివారణ వ్యాక్సిన్లు వంటివి అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు, డ్రెయిన్ల శుభ్రత, మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధవహించాలని తెలిపారు. వాగులు, వంకలు పొంగిపొర్లే సమయంలో ప్రజలు దాటకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పశువుల రక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని, పశువైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. వరదల ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ, ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాలు, రెస్క్యూ బృందాలు, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ పనిచేస్తున్నామని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రిపోర్టర్ కుటుంబానికి మధిర ప్రెస్ క్లబ్ ఆర్థిక చేయూత

Divitimedia

కారు, ఆటో ఢీ ; పలువురికి తీవ్రగాయాలు

Divitimedia

23న బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్ ఉద్యోగాలకు జాబ్ మేళా

Divitimedia

Leave a Comment