Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelanganaWELFAREWomen

రాష్ట్రంలో వడ్డీలేని రుణాల పంపిణీ ఘనంగా నిర్వహించాలి

రాష్ట్రంలో వడ్డీలేని రుణాల పంపిణీ ఘనంగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

✍️ దివిటీ – హైదరాబాద్ (నవంబరు 24)

రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు బుధవారం ఒకేసారి వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సమన్వయంతో నియోజకవర్గకేంద్రాల్లో నిర్వహించాల‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన సూచనలిచ్చారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లోని మొత్తం 3.50లక్షల మంది మహిళలకు రూ.304 కోట్లు వడ్డీలేని రుణాలందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని, ముందస్తు సమాచారం అందించి సమన్వయం చేయాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్‌కు సూచించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని విస్మరించిందని, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళల సాధికారత కోసం ఈ పథకం మరోసారి పునరుద్ధరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రెండు, మూడు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశామని, మరోసారి పెద్దఎత్తున ఈ రుణాలు అందించనున్నట్లు వివరించారు. ఇటీవల ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు విజయవంతంగా నిర్వహించారని, నాణ్యమైన చీరలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి సీతక్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీ నుంచి జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వడ్డీలేని రుణాల పంపిణీ శ్రద్ధ, సమయపాలనతో, ఘనంగా, ఆలస్యం జరగకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ తక్షణం పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితిపై నిర్మాణంలో ఉన్నవి, పూర్తి అయినవి, కేటాయించినవి వివరాలతో నివేదికలు వెంటనే సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఈ ఇళ్ల కేటాయింపులు పేదలు, నిజంగా అవసరమున్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విజయదశమి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయశోభ

Divitimedia

రవాణా వాహనాల ‘ఆటోమేటెడ్ టెస్టింగ్’ గడువు అక్టోబరు 1వరకు పెంపు

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి సీఆర్పీఎఫ్ అభినందనలు

Divitimedia

Leave a Comment