Divitimedia
AMARAVATHIAndhra PradeshBusinessLife StyleWomen

డ్వాక్రా మహిళలే యజమానులుగా తృప్తి క్యాంటీన్లు

డ్వాక్రా మహిళలే యజమానులుగా తృప్తి క్యాంటీన్లు

తక్కువ ధరలకే ‘తృప్తి’కరమైన ఆహారం

రాష్ట్రంలో 750యూనిట్లతో 30వేల మంది మహిళలకు ఆదాయం

విజయవాడ పంజా సెంటర్లో ప్రారంభించిన సురేష్ కుమార్

✍️ విజయవాడ – దివిటీ (జులై 26)

రాష్ట్రంలో పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 పథకంలో భాగంగా మహిళలతో వివిధ ప్రాంతాల్లో 750 తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో పేదమహిళల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచి, స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
శనివారం విజయవాడ వన్ టౌన్ పంజా సెంటర్ లో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్ ను ఆయన మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎమ్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా ఎదిగి విధంగా ప్రోత్సహించేందుకు ‘తృప్తి’ క్యాంటీన్లు ప్రారంభించిందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 750 క్యాంటీన్లు ప్రారంభించనున్నామని తెలిపారు. ఇప్పటికే నెల్లూరులో ఏర్పాటు చేసిన తృప్తి క్వాంటీన్ల ద్వారా దిగ్విజయంగా రోజుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఆదాయం డ్వాక్రా మహిళలకు వస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 వేల మంది మెప్మా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యం ఇచ్చారని, అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు ఈ తృప్తి క్వాంటీన్ల నిర్వహణ బాధ్యత అందిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో తొలి క్యాంటీన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారని, తక్కువ ధరలకే ప్రజలకు భోజనం అందించడంతోపాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. పట్టణ ప్రాంతాల్లో 28 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలున్నాయని, వారంతా ఆర్థికంగా బలోపేతమయ్యేవిధంగా చేయూతను అందిస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఆ లక్ష్యసాధనదిశగా పనిచేస్తూ, మహిళల జీవనోపాధులు పెంచేలా చేస్తున్నామన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను తక్కువ ధరలకే ప్రజలకు అందించే లక్ష్యంతో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్ల మాదిరిగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటుచేసి డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. జీఎస్టీతో కలుపుకుని దీనికి ప్రాజెక్ట్ వ్యయం రూ.14,51,400 అవుతుందన్నారు. ఇందులో 75 శాతం డ్వాక్రా మహిళలు, 25శాతం సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూర్చుతారని, ఆదాయం కూడా అదేవిధంగా పొందుతారన్నారు. నలుగురు మహిళా సభ్యులను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి క్యాంటీన్లను అప్పగిస్తారన్నారు. క్యాంటీన్ నిర్వహణ కోసం కంటెయినర్‌ ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. దీంట్లో పరోక్షంగా మరికొందరికి కూడా ఉపాధి లభిస్తుందన్నారు. వంట చేయడం, నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందిస్తామన్నారు. అధికారులు ఎప్పటి కప్పుడు ఆహారం తనిఖీ చేసి సూచనలు ఇస్తారన్నారు. వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకొని క్యాంటీన్లను సమర్థవంతంగా నడిపిస్తారని, కస్టమర్లకు సంతృప్తి కలిగేలా ఆహారాన్ని అందిస్తారన్నారు. ముఖ్యమైన కూడళ్లు, హైవేలకు దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారన్నారు. సారా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్టనర్ జె.సాయినాధ్ వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తారన్నారు. మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక ఉద్యోగి ఉండాలనే ముఖ్యమంత్రి కార్యాచరణకు అనుగుణంగా తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. 30,000 మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఫుడ్ సెక్టార్ లో మహిళలకు అనేక అవకాశాలున్నాయని తెలిపారు. తృప్తి క్యాంటీన్ల ప్రారంభంతో డ్వాక్రా మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారన్నారని, వారు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్.ఎమ్ మాట్లాడుతూ, నగరంలో 11 అన్న క్వాంటీన్లు నడుస్తున్నాయని, వీటికి అనుగుణంగా డ్వాక్రా మహిళలతో నేడు తృప్తి క్వాంటీన్లు ప్రారంభించామన్నారు. ఈ క్వాంటీన్లలో రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. నగరంలో ఇంకా రెండు తృప్తి క్వాంటీన్లు రాబోతున్నాయన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అందించిన రూ.10,88,550 లోన్ చెక్ ను డ్వాక్రా మహిళలకందించారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గొమ్మూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

Divitimedia

సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు

Divitimedia

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మరో కొరియర్ అరెస్ట్

Divitimedia

Leave a Comment