Divitimedia
DELHIHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

పీఎం కిసాస్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని

పీఎం కిసాస్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని

వర్చువల్ గా పాల్గొన్న కేంద్రమంత్రి సోమన్న బృందం

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా (జూన్ 18)

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 17వ విడత ఇస్తున్న నిధులను భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి వేదికగా విడుదల చేశారు. పీఎం కిసాస్ సమ్మాస్ నిధి పథకం కింద ఈ సంవత్సరం మొదటి విడతగా జరిగే నిధుల విడుదల కార్యక్రమాన్ని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి, రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోమన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు పీఎం కిసాస్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు విడతల్లో ఒక్కొక్కసారి రూ.2,000 చొప్పున ఏడాదిలో రూ.6,000 సాయం అందిస్తూ, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తోందని తెలిపారు. ఈ పథకం లో భాగం గా 17వ విడతగా ప్రస్తుతం 9.26కోట్ల మంది రైతులకు సుమారు రూ.20,000 కోట్లు జమ చేయడం జరుగుతోందని వెల్లడించారు. అదేవిధంగా వ్యవసాయ పద్ధతులలో తోటిరైతులకు సహకరించడానికి పారా- ఎక్స్ టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన 30,000 మంది పైగా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రధాని నరేంద్రమోదీ సర్టిఫికెట్లను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక అనుప్రయోగ పరిశోధన సంస్థ జోనల్ అధికారి డా.షేక్ ఎస్ మీరా మాట్లాడుతూ, ప్రపంచంలోనే మనదేశంలో అత్యధికంగా దాదాపు 80 శాతం చిన్న సన్న కారు రైతులున్నారని, వారికి ఆర్ధిక చేయూతనివ్వడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యవసాయంలో అగ్రి డ్రోన్ల మీద 85 శాతం సబ్సిడీ ఇస్తూ, అందులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వారికి శిక్షణనిచ్చే ఏర్పాటు చేస్తోందని, దీనిని రైతులు తప్పకుండా సద్వినియోగపర్చుకోవాలని కోరారు. హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాస్ నిధులను రైతులు పెట్టుబడిగా ఉపయోగించుకోవాలని కోరారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తల ద్వారా తగిన శాస్త్రీయ సాంకేతిక సలహాలు పొందుతూ వ్యవసాయరంగం లో రాణించాలని రైతులను కోరారు.
కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ప్రధాన కార్యదర్శి పరిపాటి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతును రక్షించి, వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం రైతులకు భీమా సదుపాయం కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు. వ్యవసాయంలో రైతులు నేల ఆరోగ్యం మీద అధికంగా దృష్టిపెట్టాలని, నేల ఆరోగ్యమే మానవ మనుగడకు అవసరమని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్, హెడ్ డా.ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 29.50 లక్షల మంది రైతులు 590 కోట్ల రూపాయలతో లబ్దిపొందగా, వారిలో కరీంనగర్ జిల్లా పరిధిలోనే 90515 మంది రైతులు 18.1 కోట్ల రూపాయలు పొందారని తెలిపారు. ఈ పథకం ద్వారా అదనంగా రైతులు ఆర్ధిక సహాయం పొంది, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, మందులు వంటివి కొనుగోలు చేసుకోవడంతో పాటు వారి ఆదాయం పెంచుకోవడానికి కూడా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, హుజురాబాద్ ఆర్డీఓ, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, ఆదర్శ రైతులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం

Divitimedia

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి

Divitimedia

కలెక్టరునే తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం

Divitimedia

Leave a Comment