భోజ్యాతండాలో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్
మూడురోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని భోజ్యాతండాలో చేస్తున్న భూముల రీసర్వే పనులను జిల్లాకలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్ణీత గడువులోగా రీసర్వే పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భోజ్యాతండా పరిధిలోని సర్వే నంబర్.77లో కొనసాగుతున్న భూ రీసర్వే పనుల్లో భాగంగా అధికారులు రోవర్ పరికరాల సాయంతో కొలుస్తున్న విధానం, భూముల హద్దులు గుర్తిస్తున్న ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. వాస్తవ విస్తీర్ణం, హద్దులు, స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించి, భూ రికార్డులతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ గ్రామ పరిధిలో మొత్తం 458 ఎకరాల్లో రీ సర్వే చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం సర్వే నంబర్.77లో 88ఎకరాల్లో సర్వే పనులు కొనసాగుతున్నట్లు అధికారులు జిల్లా కలెక్టరుకు వివరించారు. సర్వే పురోగతి, మిగిలిన పనులు, సర్వేకు అవసరమైన సిబ్బంది, పరికరాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వేలో జాప్యం లేకుండా సిబ్బంది సమన్వయంతో పని చేసి, ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో సర్వే మూడు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. సర్వే సమయంలో భూ యజమానుల నుంచి వివరాలు, రికార్డులు, పత్రాలను సేకరించి, భూమి హద్దులను స్పష్టంగా గుర్తించాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ వివాదాలకు అవకాశం లేకుండా రీసర్వే పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్, రీసర్వే ప్రక్రియపై రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రైతుల భూపత్రాలను పరిశీలించారు. ఆ సర్వేకు అవసరమైన తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, అందుబాటులోని భూమి రికార్డులను సర్వే అధికారులకు అందజేయడంతోపాటు, తమ భూముల వాస్తవ హద్దులను చూపించి సర్వేకు సహకరించాలని రైతులకు సూచించారు. సర్వే సమయంలో సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దారా ప్రసాద్, సర్వేయర్లు వెంకన్న, కళ్యాణ్, లైసెన్స్డ్ సర్వేయర్లు మధు, వంశీ, కవిత, జీపీఓ రాధ, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

