శ్రీవారి సేవలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్



✍️ దివిటీ మీడియా – తిరుమల
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల విచ్చేసిన యోగిఆదిత్యనాథ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు యోగికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్యచౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం యోగిఆదిత్యనాథ్ మాట్లాడుతూ, శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి దేశప్రజలందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ చేస్తున్న సమర్థవంతమైన క్యూలైన్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం పరిరక్షణను ఆయన అభినందించారు.
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవ మూర్తులను కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురు శ్రీ రామానుజాచార్య దాదాపు 1000 సంవత్సరాల క్రితం తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా శ్రీ వెంకటేశ్వరస్వామితో పాటు శ్రీరాముల వారి దివ్యరూపాన్ని కూడా తిరుమలలో దర్శించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. తిరుమల పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగారు , ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, తదితరులు యూపీ సీఎం తిరుమల పర్యటన, స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు. టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈఓ భాస్కర్ తదితరులు కూడా ఉన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

