కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా
విద్యార్థులు దేశ వ్యతిరేకశక్తుల చేతిలో పడకూడదని వ్యాఖ్యలు
✍️ దివిటీ మీడియా (న్యూడిల్లీ)
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“భారత ప్రజాస్వామ్యశక్తిపై నాకెప్పుడూ అచంచల విశ్వాసముంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు… వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గడిచిన 10 రోజులుగా జరిగిన పరిణామాలు చూసి నామనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠ కు సంబంధించిన విషయం కానే కాదు.
భారత యువశక్తే దేశానికి అసలైనబలం.
దేశయువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదు అన్నదే నా సంకల్పం. జంతర్-మంతర్ సహా దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆందోళన పరిస్థితుల్ని దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు.
దేశంలో ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతరసహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పని చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. దేశ సేవ అనేది నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలందిస్తూనే ఉంటాను…”
– ధర్మేంద్ర ప్రధాన్
Save or share this story as a newspaper-style Epaper Clip:

