Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

అధికారిక దోపిడీపై చర్యలు లేవా?

అధికారిక దోపిడీపై చర్యలు లేవా?

బూర్గంపాడు ఐకేపీలో అసలేం జరిగింది…?

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (బూర్గంపాడు)

అమాయక డ్వాక్రా పేద మహిళల నుంచి ఏకంగా అరకోటి రూపాయలకు పైగా దోచుకున్నవారిపై కఠినచర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారుల తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి… సంచలనంగా మారిన ఈ భారీ స్వాహాపర్వంలో స్థానిక, జిల్లా అధికారుల వ్యవహారశైలిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… బూర్గంపాడు మండల ఐకేపీలో వెలుగు చూసిన ‘శ్రీనిధి కుంభకోణం’పై ‘దివిటీ మీడియా’ ప్రత్యేక కథనం…

బూర్గంపాడు మండలంలో 1000కి పైగా డ్వాక్రా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 10 వేల మంది మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామ సమాఖ్యల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మహిళలను పొదుపు కార్యకలాపాల్లో ప్రోత్సాహించడం, వారికి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల కోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ గానీ వడ్డీ లేని రుణాలిప్పించడం చేస్తున్నారు. ఈ కార్యకలాపాల నిర్వహణ, సంఘాల పని తీరు పర్యవేక్షణ కోసం మండల మహిళా సమాఖ్యలో ఓ ఏపీఎం, కొందరు సీసీలు, కార్యాలయ సిబ్బంది, వీఓఏలు పనులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నహిళలు తీసుకున్న రుణాలను ‘రికవరీ(తిరిగి చెల్లించడం)’ కోసం కూడా ఆ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీనిధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థ (బ్యాంకు వంటిది) నుంచి కూడా మహిళలకు రుణాలిచ్చి, రికవరీ చేస్తుంటారు. ఆ శ్రీనిధి రుణాలు రికవరీ విషయంలోనే బూర్గంపాడు మండలంలో ఐకేపీ సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. మండలంలో ఓ క్లస్టర్లో పనిచేస్తున్న సీసీ రాంబాబు ఏకంగా రూ.57 లక్షల వరకు స్వాహా చేశాడు. అతనిని సీసీ బాధ్యతల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు ఆ నిధులను తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇంతకాలం పర్యవేక్షణాధికారులు ఏం చేస్తున్నట్లో…

అసలు బూర్గంపాడు మండలంలో శ్రీనిధి రుణాల రికవరీ డబ్బులు భారీమొత్తంలో సిబ్బంది స్వాహా చేస్తుంటే పర్యవేక్షణాధికారులు ఏం చేస్తున్నారనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది. మహిళా సంఘాల కార్యకలాపాలపై కనీసం నెలకు ఒక్కసారైనా సమీక్ష చేసే అధికారులు, ఆ అక్రమాలు తమకు తెలియకుండా జరిగినట్లు చెప్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. కిందిస్థాయిలో ఆ మహిళా సంఘాల లెక్కలు చూసే వీఓఏలుగానీ, పై స్థాయిలో పర్యవేక్షించే ఏపీఎం గానీ ఆ నిధుల రికవరీలో ప్రత్యేక పర్యవేక్షణ చేసే ‘శ్రీనిధి’ అధికారులు గానీ నిధుల స్వాహా వ్యవహారం తమకసలే తెలియదంటుంటే నమ్మశక్యంగా లేదు. కనీసం నెలకోసారి జరిగే సమావేశాల్లో ఆ గ్రూపు పనితీరుపై చర్చలు, తీర్మానాలు, పొదుపు, రుణాల రికవరీ, తదితర వివరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సీసీ, ఏపీఎం, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న అధికారులపై ఉంది. ఇంత పకడ్బందీగా మహిళా సంఘాలు, గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్య పనితీరు పర్యవేక్షించాల్సిన, పర్యవేక్షణ చేస్తున్న అధికారులకు ఒక సీసీ చేస్తున్న అక్రమాల గురించి రెండేళ్ల వరకు తెలియదంటే నమ్మశక్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే రూ.57లక్షల స్వాహాపై కిందనుంచి పైదాకా అందరికీ తెలుసనేది అర్థమవుతోంది. ఈ స్వాహాపర్వంలో సీసీతోపాటు కొందరు ఉన్నతాధికారులు కూడా భాగస్వాములయ్యారని, అందుకే దాదాపు రెండేళ్ల వరకు నిరాటంకంగా ఈ దందా జరిగుంటుందని భావిస్తున్నారు.
బూర్గంపాడు మండలంలో కేవలం కొన్ని మహిళా సమాఖ్యల్లోనే ఇంత అక్రమాలు జరిగితే మిగిలినవాటిలో కూడా ఇలాంటి వెలుగు చూడని దారుణాలెన్ని ఉండి ఉంటాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే మండలంలో అన్ని సంఘాలు, గ్రామ సమాఖ్యలతో పాటు మండల మహిళా సమాఖ్యలోనూ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏపీఎం నాగార్జునను ‘దివిటీ మీడియా’ వివరణ కోరగా, తనకు ఈ అక్రమంలో ఎలాంటి సంబంధమూ లేదన్నారు. విచారణ చేసి బాధ్యులపైన ఉన్నతాధికారులే చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Divitimedia

గోదావరిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

Divitimedia

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

Divitimedia

Leave a Comment