Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleTelanganaYouth

అధికారులా… ? ఏమీ చేయలేని అసహాయులా…?

అధికారులా… ? ఏమీ చేయలేని అసహాయులా…?

అక్రమార్కుల ఇష్టారాజ్యం – చోద్యం చూస్తున్న అధికారగణం

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా

ఓవైపు ఇసుక, మట్టి మాఫియాలు…. మరోవైపు బెల్టుషాపులతో మందుబాబుల ఆగడాలు… తమను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో చెలరేగుతున్న గంజాయి ముఠాలు… ఇంకోవైపు వాటాల కోసం పోట్లాడుకునే అక్రమార్కులు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో నానాటికీ వేగంగా దిగజారుతున్న పరిస్థితులివి. ఒకప్పుడు కాస్తోకూస్తో ప్రశాంతమైన ప్రాంతంగా పేరున్న ఈ మండలంలో తమ విధులు, బాధ్యతలను మరిచిపోయినట్లే ప్రవర్తిస్తున్న అధికారుల వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టపగలే అక్రమాలకు కేంద్రంగా మారిన ఇసుక వ్యాపారం, అర్థరాత్రి దోపిడీ చేసే మాఫియా సామ్రాజ్యంగా తయారైంది. బూర్గంపాడు మండలంలో అర్థరాత్రి ఇసుక దోపిడీకి సారపాక, తాళ్లగొమ్మూరు, మోతె, పాతగొమ్మూరు, సోంపల్లి, బుడ్డగూడెం, పినపాక పట్టీనగర్, ఉప్పుసాక ప్రాంతాలు ఇసుక మాఫియా అడ్డాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లో ప్రతి రోజూ రాత్రివేళ జేసీబీలు, లోడింగ్ యంత్రాలు, ట్రాక్టర్ల రొదలతో ఆయా ప్రాంతాల ప్రజలకు కనీసం నిద్రపోలేని దుస్థితి నెలకొంది. అర్థరాత్రి వేళ ఇంత బాహాటంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నా అధికారులకు మాత్రం ‘చీమకుట్టినట్లు’ కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. కొందరు అధికారులు ముడుపులమత్తులో జోగుతుంటే, మరికొందరేమో తామేమీ చేయలేమనే నిస్సహాయత, నిర్లిప్తతతో ఉంటున్నారని తెలుస్తోంది. ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, అటవీశాఖలకు ఏమాత్రం పట్టింపులేకపోవడం గమనార్హం. మండలం పరిధిలో ఇసుక ఒక్కటే కాకుండా మట్టిని కూడా తమ అక్రమ వ్యాపారానికి అవకాశంగా మార్చుకున్న కొంత మంది పట్టపగలు, రాత్రి అనే తేడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా సీతారామ కాలువ వెంబడి తవ్వితీసిన మట్టిని అక్రమంగా తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్న అక్రమార్కులకు అధికారులు తమ శక్తికొద్దీ సహకరించి వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారుల వ్యవహారశైలి కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చే రీతిలోనే ఉండటం గమనార్హం. అక్రమ వ్యాపారాలతో నేరుగా తమకొచ్చిన నష్టమేమీలేదనే దుర్భుద్ధితో కొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా అక్రమార్కులకు యధాశక్తి సహకరిస్తున్నారు. వారిలో కొందరైతే ఏకంగా ఈ అక్రమ వ్యాపారాలలో భాగాలు పంచుకుంటున్నారు. వాటాలలో తేడాలొస్తూ తమలోతామే గొడవలు పడుతూ, తమతమ పార్టీలు, నేతల పరువును బజారుకీడుస్తున్నారు. మండలంలో ప్రతిరోజూ దాదాపు రూ.20లక్షలకు పైగానే ఇసుక, మట్టి అక్రమ వ్యాపారం జరుగుతోందనేది ఓ అంచనా. ఇంత జరుగుతున్నా అధికారుల అసమర్థత ఏమాత్రం తగ్గడం లేదనే విమర్శలున్నాయి. ఇంకోవైపు సారపాక పారిశ్రామిక ప్రాంతం గంజాయి, నేరాలకు కేంద్రంగా మారుతోంది. భద్రాచలంతోపాటు పక్కనే సారపాకలో గంజాయి ముఠాల కార్యకలాపాలతోపాటు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్టుషాపుల కారణంగా ప్రశాంతత లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సారపాకలో ద్విచక్ర వాహనంపై గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగి, గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితికితోడు మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా వందలసంఖ్యలో వెలుస్తున్నాయి. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బెల్టుషాపుల కారణంగా పరిస్థితులు అదుపు తప్పి ఘర్షణలు, నేరాలకు దారితీస్తున్నాయి. గాంధీనగర్, బసప్పక్యాంప్, ముత్యాలమ్మ పేట, తాళ్లగొమ్మూరు ప్రాంతాలలో ఇటీవల ఘర్షణలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువత గంజాయి, మద్యం మత్తులో ఘర్షణలకు పాల్పడుతున్న ఉదంతాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్ కేంద్రాలుగా మండలంలో పరిస్థితులు అదుపు తప్పకముందే జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా చీకటి వ్యాపారాలు, వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేవిధంగా బూర్గంపాడు మండల అధికారుల పని తీరును చక్కదిద్దేందుకు అవసరమైతే కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Divitimedia

మణుగూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయాలి

Divitimedia

గిరిజన మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపులు

Divitimedia

Leave a Comment